జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ : ఎంపీ రఘునందన్ రావు
మెదక్, ఆగస్టు 29 (భద్రాద్రిన్యూస్) 45వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారం మెదక్ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీహెచ్ఈఎల్ శ్రీ వాణి విద్యానికేతన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు కాటూరి శ్రీనివాసరావు , జనరల్ సెక్రెటరీ పి.వి. రమణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు, తెలంగాణ సెక్రటరీ వి.వి. రమణ, ఇండియన్ రైల్వేస్ కోచ్ శశి తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్‌కు భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. 1954లో ఈ క్రీడకు గుర్తింపు లభించిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మధ్యలో గుర్తింపు కోల్పోయినప్పటికీ 2022లో తిరిగి పునరుద్ధరించామని తెలిపారు. ఈ ఏడాది కూడా గుర్తింపును పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు.
భారతదేశంలో క్రీడలకు గతంలో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించలేదని ఎంపీ అన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య తక్కువగా ఉండేదని, తాము విద్యార్థులుగా ఉన్న సమయంలో భారతదేశానికి ఒక్క పతకం వచ్చినా టీవీల ముందు ఆసక్తిగా ఎదురుచూసేవారమని గుర్తుచేశారు.
2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం క్రీడా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, యోగా, యంగ్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు.
దివ్యాంగుల అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచారని ఎంపీ తెలిపారు. మహిళలను క్రీడల్లోకి పంపేందుకు భయపడే తల్లిదండ్రులు ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నికిత బిరియా వంటి క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కేవలం 16 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించి దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన మలావత్ పూర్ణను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
క్రీడల్లో కష్టపడి ప్రతిభను నిరూపించుకోవాలని, మెదక్ జిల్లా జట్టు విజయం సాధించి తనకు బహుమతిగా అందించాలని క్రీడాకారులను ఎంపీ రఘునందన్ రావు కోరారు.
క్రీడాకారులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు
మరో ముఖ్య అతిథి పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పోటీలకు హాజరైన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఉపాధ్యాయులు, కోచ్‌లు, తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రీడాస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్టార్ ఆఫ్ ఇండియా రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ దుర్గయ్య, జాయింట్ సెక్రటరీ పి.ఎం. కమల్ కుమార్, బి. శ్యామ్, ఈసీ సభ్యులు సారధిరావు, స్టేట్ కమిటీ చైర్మన్ వీరభద్రరావు, రామకృష్ణారావు, బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ సొసైటీ సభ్యులు బాలయ్య, రెహమాన్, నీలకంఠం, శ్రీ వాణి విద్యానికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సుమలత, ఎం.ఎల్.ఎన్. రెడ్డి, భీమ్ రెడ్డి సీనియర్ సిటిజన్ కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పది జిల్లాల నుంచి వచ్చిన టీం మేనేజర్లు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల ప్రారంభంతో క్రీడా ప్రాంగణం
సందడిగా మారింది.