BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:42 pm Posted by : BHADRADRI NEWS

సింగరేణి మండలంలో ఆబ్కారీ శాఖ ఉందా… లేదా?

వైన్ షాపుల సిండికేట్‌పై ఎందుకు మౌనం?

ఎమ్మార్పీకి మించి విక్రయాలు

రాత్రి వేళ బెల్ట్ షాపుల దందా

జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలంటూ ప్రజల డిమాండ్

కారేపల్లి (భద్రాద్రి న్యూస్) సింగరేణి మండలంలో ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరల కంటే రూ.15 నుంచి రూ.30 వరకు అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు.

వైన్ షాపులు ఒకే విధంగా అదనపు ధరలు వసూలు చేస్తుండటంతో సిండికేట్ వ్యవస్థ నడుస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. బిల్లు లేకుండా విక్రయాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, వినియోగదారుల ఫిర్యాదులు వరుసగా వెలుగులోకి వస్తున్నా ఎక్సైజ్ శాఖ స్పందన లేకపోవడం ప్రజల్లో పలు ప్రశ్నలకు తావిస్తోంది.

రాత్రి 9 గంటల తర్వాత గ్రామాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగుతున్నా పర్యవేక్షణ, తనిఖీలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968 ప్రకారం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు మౌనం వీడకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎమ్మార్పీకి మించి విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, బిల్లు లేకుండా సాగుతున్న అమ్మకాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సోమవారం నాటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు సిండికేట్ వ్యవహారంపై మౌనం వీడకపోతే, ఇప్పటివరకు వెలువడిన అన్ని పత్రికా కథనాల కటింగ్‌లను జిల్లా కలెక్టర్‌కు నేరుగా సమర్పించి, ప్రత్యేక విచారణ కోరనున్నట్లు స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఫిర్యాదులు, పత్రికల కథనాలను జిల్లా యంత్రాంగం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది