BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 2:02 pm Posted by : BHADRADRI NEWS

వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులల అరెస్టు

వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి

ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 9 (భద్రాద్రిన్యూస్) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో జులై 17 అర్దరాత్రి వృద్ధురాలిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన కేసును కూసుమంచి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడున పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్ (26), అదేవిదంగా అతనికి సహకరించిన బాలినిధర్మారం, మర్రిపెడ మండలం, మహాబూబాబాద్ జిల్లాకు చెందిన సరగండ్ల మహేష్ (20), లను ఆదివారం ఉదయం తిరుమలాయపాలెం రోడ్డులో  పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కేసు వివరాలు ప్రకారం… పిండిప్రోలు గ్రామంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న ఐతనబోయిన ప్రశాంత్ కు మద్యం సేవించడం, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని, తన చికెన్ పాప్ సమీపంలో నివసిస్తున్న వృద్ధ దంపతులను గమనిస్తూ వృద్ధురాలు సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి వాటిని దోచుకోవాలని పథకం వేసుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలో జులై 17 న అర్ధరాత్రి సమయంలో, వృద్ధురాలి ఇంటికి వెళ్లిన ప్రశాంత్ బంగారు ఆభరణాలు దోచుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించిందని, దీంతో తన వెంట తీసుకెళ్లిన ఇనుప రాడ్డుతో ఆమెపై దాడి చేసి హత్య చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు చైన్, నల్లపూసల చైన్ సంబంధించిన బంగారు బిళ్లలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. హత్య అనంతరం దొంగిలించిన బంగారు చైన్ ను తన వరుసకు బామ్మర్ది అయిన సరగండ్ల మహేష్ కు ఇచ్చి బ్యాంక్ లో పెట్టి డబ్బులు తెమ్మని చెప్పగా, మహేష్ ఆ బంగారు చైన్ ను తన పేరుతో ఖమ్మంలో ఒక బ్యాంక్ లో తనఖా పెట్టి రూ.1,50,000/- రుణం పొందినట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ ఆధ్వర్యంలో కె. జగదీష్,పి. సంతోష్, జె. నాగరాజు, హరికృష్ణ పి ఎస్ ఐ దివ్య తో ఏర్పాటు అయిన నాలుగు ప్రత్యేక బృందాలు సమన్వయంతో దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అలాగే సిబ్బంది పూర్ణ చందర్ రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీనులను పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.  నిందితుల నుండి బంగారు బిళ్లలు (ఏసులు)= 09, మొబైల్ ఫోన్ =02, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్, ద్విచక్ర వాహనం, గోల్డ్ లోస్ సంబంధిత పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.