BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 12:08 pm Posted by : BHADRADRI NEWS

ఎదురుగడ్డ హత్య కేసును చేదించిన లక్ష్మిదేవిపల్లి పోలీసులు

పాత కక్షలతోనే అఖిల్ హత్య..

నలుగురు నిందితుల అరెస్ట్!

 

సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు

హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్‌ఫోన్లు, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం

 

లక్ష్మీదేవి పల్లి, అక్టోబర్ 28 (భద్రాద్రి న్యూస్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామంలో సంచలనం సృష్టించిన మేడి అఖిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టెక్నికల్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.

బస్‌స్టాండ్ సమీపంలో నిందితుల అరెస్ట్

నమ్మదగిన సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం బస్‌స్టాండ్ సమీపంలో నిందితులు దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్సు, ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్‌లను అదుపులోకి తీసుకున్నారు.

పాత గొడవలు.. పక్కా పథకంతో హత్య

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో గణేష్, సాత్విక్‌లు అఖిల్‌పై పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు పథకం రచించి, మద్యం తాగిస్తామని నమ్మించి అఖిల్‌ను ఎదురుగడ్డ గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు.

2026 అక్టోబర్ 19వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గణేష్ కత్తితో అఖిల్ మెడపై పలుమార్లు పొడిచినట్లు, సిమెంట్ ఇటుకతో ముఖంపై దాడి చేయగా సాత్విక్ కూడా ఇటుకతో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ దాడిలో అఖిల్ మృతి చెందాడు. ఈ హత్యకు సంబంధించి మిగిలిన ఇద్దరు నిందితులు సైతం ముందస్తు పథకంలో భాగంగా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్‌పే లావాదేవీలు.. కీలక ఆధారాల స్వాధీనం

హత్యకు ముందు మద్యం కొనుగోలు తదితర అవసరాల కోసం ఫోన్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఫోన్‌పే లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ.. వ్యక్తిగత కక్షలు, పాత గొడవల కారణంగా హింసాత్మక చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకొని నేరాలకు పాల్పడవద్దని, సమస్యలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతకాలం పరారీలో ఉన్నా సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించి చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.

ఈ కేసులో నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతరుల ప్రమేయం తదితర అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు ఛేదనలో టెక్నికల్ టీమ్ సహకారం కీలకంగా నిలిచిందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.