రెహాన్‌కు స్వర్ణం.. అబ్దుల్ రెహ్మాన్‌కు రజత పతకం
ఖమ్మం ప్రతినిధి, నవంబర్ 2 (భద్రాద్రి న్యూస్) జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో ఖమ్మం శ్రీనివాస నగర్‌లోని రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నవంబర్ 1న వర్తక సంఘంలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్–2026 పోటీల్లో పాఠశాలకు చెందిన ఆరవ తరగతి విద్యార్థులు రెండు పతకాలు సాధించి ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో విద్యార్థి రెహాన్ స్వర్ణ పతకం సాధించగా, అబ్దుల్ రెహ్మాన్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో విద్యార్థులు పతకాలు సాధించడంతో పాఠశాలకు, ఖమ్మం జిల్లాకు గుర్తింపు లభించింది. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం ఆర్.వి. నాగేంద్ర కుమార్, నీలిమా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా సహకరిస్తామని తెలిపారు. విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పతక విజేతలను అభినందించారు.
